కర్నాటక రాజధాని నగరం బెంగళూరులో కొత్త మెట్రో లైన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 4,249 కోట్ల వ్యయంతో నిర్మించిన 13.71 కిలోమీటర్ల మేరకు వైట్ ఫీల్డ్ నుంచి క్రిష్ణారాజపురం మెట్రో లైన్ ను 12 స్టేషన్లతో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మెట్రోలో ప్రయాణించి, బెంగళూరు మెట్రో రైలు సిబ్బంది, నిర్మాణ కార్మికులు, విద్యార్థులు, ప్రజలతో సంభాషించారు. మెట్రో రైలు ఎక్కేందుకు ప్రధాని మోదీ సాధారణ ప్రయాణికుడిలాగానే ప్రవేశ ద్వారం గుండా వెళ్లారు. బైయప్పనహళ్లి నుంచి వైట్ ఫీల్డ్ స్టేషన్ వరకూ పనిచేసే తూర్పు పశ్చిమ కారిడార్ కి తూర్పు పొడిగింపు అని అధికారులు అన్నారు. నిర్మాణంలో వున్న 15.81 కిలోమీటర్ల పొడిగింపులో కేఆర్ పురం నుంచి వైట్ ఫీల్డ్ వరకూ 13.71 కిలోమీటర్ల సెక్షన్ ను ప్రారంభించారు. దీంతో 40 శాతం ప్రయాణ సమయం తగ్గుతుందని, ట్రాఫిక్ కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
