ఢిల్లీ వేదికగా జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇందు కోసం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంట్రల్ లో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ సమావేశంలో బాబు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పాటు చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ప్రత్యేకంగా 5 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడారు. ఇక… రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చంద్రబాబుతో టీడీపీ ఎంపీలు కూడా ముర్మును కలసుకున్నారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం చంద్రబాబుకు ఏపీకి తిరుగుపయనమయ్యారు.
చాలా సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై కనిపించారు. 2019 ఎన్నికల తర్వాత ప్రధాని మోదీని కలుసుకోవడం ఇదే ప్రధమం. అయితే.. చంద్రబాబు తిరిగి టీడీపీకి దగ్గరవుతున్నారన్న వార్తలు పుకార్లు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో బీజేపీ వైసీపీకి దూరంగా జరిగి, టీడీపీకి దగ్గరవుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.