ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆది మహోత్సవ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ “ఆది మహోత్సవ్”ను ప్రారంభించిన ప్రధాని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోడీ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు. గిరిజన సంక్షేమం కోసం ఇంతకు ముందు ఎన్నడూ ఇంతలా ప్రయత్నాలు జరగలేదని ప్రధాని మోదీ అన్నారు.
తాను దేశాధినేతలను కలిసినప్పుడు, గిరిజనులు గర్వించదగిన సంప్రదాయాన్ని, బహుమతులను వారికి అందజేస్తానని ప్రకటించారు. వాతావరణ మార్పులు, భూతాపం వంటి సవాళ్లకు పరిష్కారం కావాలంటే, మన గిరిజనుల జీవన సంప్రదాయాన్ని చూడండి అని సూచించారు. మార్గం దొరుకుతుందని ఈ రోజు భారతదేశం ప్రపంచానికి చెబుతోందని సూచించారు. గిరిజన ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ బాగా పెరిగిందన్నారు. గతంలో వెదురును తీసుకోకుండా అనేక నిషేధాలు విధించారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధాలను తొలగించామన్నారు. దీని ద్వారా వెదురు ఉత్పత్తుల గిరాకీ పెరిగిందన్నారు. కొత్త విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. మాతృభాష ఎంపికను అందులో ఉంచామని ప్రధాని మోదీ తెలిపారు. 2014తో పోలిస్తే ఈసారి గిరిజనుల బడ్జెట్‌ను 5 రెట్లు పెంచామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా గిరిజన మహిళలు దేశానికి రాష్ట్రపతి అయ్యారని.. తొలిసారిగా బిర్సా ముండా జన్మదినాన్ని గిరిజనుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.
ఆది మహోత్సవ్”లో గిరిజనుల వారసత్వాన్ని ఒకే వేదికపై 200 స్టాళ్లలో ప్రదర్శిస్తున్నారు. సుమారు 1000 మంది గిరిజన కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొంటున్నారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నందున చేనేత, కుండలు, హస్తకళలు, ఆభరణాలు వంటి సాధారణ ఆకర్షణలతో పాటు, గిరిజనులు పండించే ప్రత్యేక అన్నాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 27 వరకు ఆది మహోత్సవ్ జరగనుంది.