ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాజ్ భవన్ లో బస చేశారు. సికింద్రాబాద్ పరెడ్ గ్రౌండ్ లో బీజేపీ విజయ సంకల్ప్ సభ ముగిసిన తర్వాత రాత్రి బస కొరకు ప్రధాని మోదీ రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరవింద యోగికి సంబంధించిన కొన్ని పుస్తకాలను గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీకి అందజేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు.
ఆ తర్వాత తెలంగాణలోని పరిస్థితులు, సీఎం కేసీఆర్ ప్రభుత్వ వ్యవహార శైలి గురించి గవర్నర్ ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ఉదయం ప్రధాని మోదీ రాజ్ భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో భీమవరానికి చేరుకుంటారు. అల్లూరి సీతారామ రాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సభలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటున్నారు. కాంస్య విగ్రహ ఆవిష్కరణ తర్వాత.. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.