అల్లూరి సీతారామ రాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంతో ఆవిష్కరించారు. భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా పెద అమిరంలో వున్న అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి వెన్నంటే వున్న మల్లు దొర మనుమడు బోడి దొరను ప్రధాని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. యావత్ భారతా వనికే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా అన్న పాటతో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి…
అల్లూరి జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తి దాయకమని ప్రధాని అన్నారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలందర్నీ ఏకాతాటిపైకి తెచ్చారని, మన్యం వీరుడిగా ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారని తెలిపారు. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు, వీరేశలింగం వంటి ప్రముఖులకు జన్మనిచ్చిన గడ్డ ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. ఇలాంటి పుణ్య భూమికి రావడం తనకెంతో ఆనందమని అన్నారు. వీర భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.
స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్ మ్యూజియంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లాలను అభివృద్ధి చేస్తామని మోదీ ప్రకటించారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పోలీస్ స్టేషన్ ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలపై పోరాడే తత్వం అల్లూరి నుంచి నేర్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. దేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటాలు చేశారని, వారందర్నీ గుర్తుంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.