భారత్ లో జరుగుతున్న జీ 20 విదేశాంగ మంత్రుల సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు అట్టర్ ప్లాఫ్ అయ్యాయన్నారు. అసలు సంక్షోభాలున్నాయన్న విషయాన్ని అందరూ గమనంలోకి తీసుకొని, మొదట గుర్తించాలన్నారు. ప్రపంచ విభజన సమయంలో సదస్సులు జరుగుతున్నాయని, కాబట్టి, ఈ సమస్యలపై సామూహికంగా పరిష్కారాన్ని కనుగొనాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పాల్గొనని దేశాల గురించి కూడా ఆలోచించాలని, దక్షిణాది దేశాల తరపున గళం వినిపించేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు. ఆర్థిక సంక్షోభం, పర్యావరణ మార్పులు, మహమ్మారి, ఉగ్రవాదంతో ఎదురైన పరిస్థితులతో ప్రపంచ స్థాయి సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధన భద్రతను కల్పించడం కోసం భరించలేని అప్పులతో కుంగిపోతున్నాయని, అలాగే ధనిక దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా దక్షిణాది దేశాలు ప్రభావితం అవుతున్నాయన్నారు.
భారతీయ వినియోగదారులు, తయారీదారులు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నారని.. మీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల స్ఫూర్తిని అందించాలని అన్నారు. భారత్ (India)లో డిజిటల్ పేమెంట్స్ గతి చక్రాన్ని యూపీఐ మలుపు తిప్పిందని కొనియాడారు. ప్రపంచ దేశాలకు ఈ యూపీఐ ప్లాట్‌ఫారం ఒక టెంప్లేట్‌గా ఉపయోగపడుతుందని సూచించారు. డిజిటల్ పేమెంట్స్‌పై ఉన్న అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి భారత్ సిద్ధమంటూ మోదీ వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు విస్తృతంగా వినియోగిస్తున్న యూపీఐని ఇతర దేశాలు కూడా అనుసరించే ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు.