దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి అయిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ఫస్ట్ ఫేజ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజస్తాన్ లోని దౌసాలో ప్రారంభించారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలోని 246 కి.మీ ఢిల్లీ-దౌసా-లాల్సోట్ సెక్షన్‌ను రూ.12,150 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. ఈ మార్గం వల్ల ఢిల్లీ నుంచి జైపూర్‌కు ప్రయాణ సమయం ఐదు గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గుతుంది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ…దేశం కోసం.. అందరితో కలిసి, అందరి అభివృద్ధి అనేదే తమ మంత్రంమని అన్నారు. దాన్ని అనుసరిస్తూనే సామర్థ్య భారతాన్ని నిర్మిస్తున్నాం. మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం హైవే ప్రాజెక్టులు, ఓడరేవులు, రైల్వేలు, ఆప్టికల్ ఫైబర్, మెడికల్ కాలేజీలను తెరిచినప్పుడు వ్యాపారులు, చిన్న దుకాణదారులు మరియు పరిశ్రమలకు బలం చేకూరుతుందని అన్నారు. పని కోసం ఢిల్లీకి వెళ్లే వారు ఇప్పుడు తమ పనిని ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి రావచ్చని పేర్కొన్నారు.
మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల మీదుగా ఈ ఢిల్లీ – ముంబై హైవే వెళుతోంది. కోటా, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదర, సూరత్ లాంటి కీలక నగరాల మీదుగా ఉంది. ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‍వే 8 లేన్లుగా ఉంది. భవిష్యత్తులో 12 లేన్లకు విస్తరించే సదుపాయం కూడా ఉంటుంది. సుమారు రూ.లక్ష కోట్ల నిధులను వెచ్చించి గతిశక్తి పథకం కింద ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‍వేను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. 2018లో రూ.98,000 కోట్లతో ప్రణాళిక రచించింది. ఇది కాస్త అధికమైనట్టు సమాచారం. ప్రధాని మోదీ నేడు ప్రారంభించిన ఢిల్లీ – దౌసా – లాల్‍సోత్ తొలి దశకు రూ.12,150 కోట్లు ఖర్చయింది. 2018లో మంబై – ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‍వే నిర్మాణాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ హైవే కోసం 12 లక్షల టన్నుల స్టీల్‍ను వినియోగిస్తోంది. హోరా బ్రిడ్జికి ఉండే స్టీల్‍తో పోలిస్తే ఇది 50 రెట్లు. ఈ హైవే వల్ల వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది కేంద్రం.