75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఆ తర్వాత సైనిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి 80 నిమిషాల పాటు కీలక ప్రసంగం చేశారు. సంప్రదాయ కుర్తా, చుడీదార్, నీలిరంగు జాకెట్ ధరించి, జెండా రంగులున్న తెలుపు తలపాగాను ధరించారు. అవినీతి, కుటుంబ పాలన, బంధుప్రీతి అతిపెద్ద సవాళ్లని, వీటిని దేశం నుంచి తరిమేయాల్సిన సమయం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవి కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కావని, అన్ని రంగాల్లోనూ ఉన్నాయని చెప్పారు. 25 ఏండ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే పంచ ప్రాణాల లక్ష్యమని, దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలను కోరారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో కొత్త సంకల్పంతో కొత్త మార్గంలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ పాలన దేశానికి తీవ్ర అన్యాయం చేసిందని, కుటుంబ రాజకీయాలు సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తాయని పేర్కొన్నారు. దేశ సంక్షేమంపై వాటికి ఎలాంటి ఆసక్తి ఉండదని, భారతదేశ రాజకీయాలను, సంస్థలను ప్రక్షాళన చేయడంలో ప్రజలు తనతో కలిసి రావాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అవినీతిపై నిర్ణయాత్మక దశలోకి అడుగుపెట్టాం….
దేశాన్ని చెదపురుగులా పట్టి పీడిస్తున్న అవినీతిపై చేస్తున్న పోరాటంలో భారతదేశం ఒక నిర్ణయాత్మకమైన దశలోకి అడుగుపెట్టిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, ఆధార్, మొబైల్ వంటి అన్ని ఆధునిక వ్యవస్థలనూ వాడుకుంటూ గత ఎనిమిదేళ్లలో రూ.2 లక్షల కోట్ల మేర అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా చేశామని పేర్కొన్నారు. ఆ సొమ్మును దేశాభివృద్ధికి ఖర్చు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులను లూటీ చేసి దేశం నుంచి పారిపోయిన వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని.. కొందరు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అలాగే.. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం రాజకీయాల్లోనే కాక దేశంలోని అన్ని వ్యవస్థల్లోకీ వ్యాపించాయని, ప్రతిభను అణగదొక్కుతున్నాయని మోదీ ఆందోళన వెలిబుచ్చారు. కాబట్టి.. దేశ రాజకీయాలతోపాటు, అన్ని వ్యవస్థల నుంచి ఈ ఆశ్రితపక్షపాత నిర్మూలనకు జాతీయ జెండా సాక్షిగా ప్రతినబూనాలని పిలుపునిచ్చారు.
జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. జై అనుసంధాన్…
ఇది ఇండియా ‘టెకేడ్’ సమయమని, డిజిటల్ టెక్నాలజీ ప్రతి విషయంలో సంస్కరణలను తీసుకురానుందని మోడీ చెప్పారు. 5జీ, సెమీ కండక్టర్ల తయారీ, గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా క్షేత్రస్థాయి నుంచి రివల్యూషన్ తీసుకువస్తున్నామని అన్నారు. ఆవిష్కరణలకు ‘జై అనుసంధాన్’ అవసరం ఉందని ప్రధాని అన్నారు. ‘జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. జై అనుసందధాన్’ అని నినాదాన్ని ఇచ్చారు. ప్రపంచంలో 40% ఫైనాన్షియల్ డిజిటల్ లావాదేవీలు ఇండియాలోనే జరుగుతున్నాయి. మన దేశం త్వరలో 5జీ యుగంలోకి అడుగుపెడుతున్నది. ఆప్టిక్ ఫైబర్‌ను ఏర్పాటు చేయడంలో వేగంగా అడుగులు వేసిందని ఎర్రకోట వేదికగా ప్రకటించారు. కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పుడు.. ప్రపంచం యావత్తూ ఏం చేయాలో నిర్ణయించుకోలేని సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు.. నిర్దిష్ట కాలపరిమితిలోనే మన దేశం 200 కోట్ల వ్యాక్సినేషన్ల మైలురాయిని చేరిందని మోదీ గుర్తుచేశారు.