బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ కు రానున్నారు. మోదీకి స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ సీసీ సెంటర్ కు చేరుకుంటున్నారు. తర్వాత 4 గంటల నుంచి 9 గంటల వరకూ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు.
తదుపరి బస నిమిత్తం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు వస్తారు. 288 గదులున్న ఈ హోటల్ లో ఓ ఫ్లోర్ మొత్తాన్ని ప్రధానికి కేటాయించారు. ఈ ప్రాంతాన్ని ఎస్పీజీ ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక రెండు రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల తర్వాత పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక.. ప్రధాని నగరంలో పర్యటించే ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసు అధికారులు ట్రయల్ రన్ పూర్తి చేశారు. భద్రతా పరంగా గట్టి చర్యలు తీసుకున్నామని ఇప్పటికే ప్రకటించారు.
పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన బీజేపీ
పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే సభకు బీజేపీ విజయ్ సంకల్ప్ అన్న పేరు పెట్టింది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తో పాటు ఇతర సీనియర్లు బహిరంగ సభ ప్రాంగణాన్ని పలు మార్లు సందర్శించారు. ఈ సభలో మొత్తం 4 వేదికలను ఏర్పాటు చేశారు. ఓ వేదికపై ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్, గడ్కరీ, కిషన్ రెడ్డి, సంజయ్; లక్ష్మణ్, డీకే అరుణ వుంటారు. రెండో వేదికపై సీఎంలు, కేంద్ర మంత్రులు పాల్గొంటారు. మరో వేదికపై సాంస్కృతిక బృందాల కళా ప్రదర్శనలు ఉంటాయి.