రాజ్యసభలోనూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని రాజ్యసభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ‘అభివృద్ధి చెందిన భారత దేశం’ దార్శనికతను పార్లమెంటుకు సమర్పించారని పేర్కొన్నారు. అయితే.. మోదీ మాట్లాడుతుండగా…. విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. అదానీ విషయం గురించి స్పందించాల్సిందేనని పట్టుపట్టాయి. అయినా… మోదీ తన ప్రసంగాన్ని ఆపకుండానే.. కాంగ్రెస్ కి చురకలంటించారు. వారు ఎంత బాగా బురద చల్లితే.. కమలం అంత బాగా వికసిస్తుందని కౌంటర్ ఇచ్చారు. కొందరి భాష, ప్రవర్తన బాగా నిరాశ కలిగిస్తోందని, సభలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు.
ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆలోచన కూడా లేదని, సమస్యలకు పరిష్కారం చూపాల్సిన సభలో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడ్డారు. అందరికీ ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం కలిగేలా చేశామని, అసలైన సెక్యులరిజంతో ముందుకు సాగామని తెలిపారు. 18 వేలకు పైగా గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపామని, గత 4 సంవత్సరాల్లో 11 కోట్ల ఇళ్లకు తాగు నీరు అందించామని వివరించారు. 2014 కి ముందు ఆ సంఖ్య కేవలం 3 కోట్లుగా వుండేదని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం ఏ సమస్యకూ పరిష్కారం చూపలేదని, ఆరు దశాబ్దాల కాలాన్ని దేశం కోల్పోయిందన్నారు.
ఆర్టికల్ 356 ని ఏ ప్రభుత్వం ఎక్కువ సార్లు దుర్వినియోగం చేసింది? అంటూ ప్రధాని సూటిగా ప్రశ్నించారు. ఆ ఆర్టికల్ ను ఉపయోగించి ఎన్నికైన ప్రభుత్వాలను 90 సార్లు పడగొట్టారని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఆ పని చేసిందవరో చెప్పాలని డిమాండ్ చేశారు. 356 ఆర్టికల్ ని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 50 సార్లు ఉపయోగించారని గుర్తు చేశారు. కేరళలో అప్పట్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైందని, అది నెహ్రూకి నచ్చలేదని, కూల్చేశారని గుర్తు చేశారు.
తాము రూపొందించిన ప్రభుత్వ పథకాల పేర్లలో తాము పెట్టిన పేర్లకు, సంస్కృత పదాలతో సమస్యలు వున్నాయని, గతంలో 600 ప్రభుత్వ పథకాలకు గాంధీ, నెహ్రూ పేర్లే పెట్టారని, ఓ నివేదిక చదవడంతో ఈ విషయం బయటపడిందని మోదీ తెలిపారు. దాదాపు 600 ప్రభుత్వ పథకాలకు ఆ కుటుంబాల పేర్లే పెట్టి, తెగ ప్రచారం చేశారని, మరి తరువాతి తరాలు వారి పేర్లను ఎందుకు పెట్టుకోలేదో తనకు ఏమాత్రం అర్థం కావడం లేదని మోదీ దెప్పిపొడిచారు.