ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పెద్దల సభ గౌరవాన్ని పెంచారని, రాజ్యసభ సెక్రెటేరియట్ లో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పెద్దల సభను రాజ్యసభ చైర్మన్ హోదాలో అద్భుతంగా నిర్వహించారని మెచ్చుకున్నారు. రాజ్యసభలో సోమవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… అనేక హోదాల్లో తాను వెంకయ్య నాయుడితో కలిసి పనిచేసిన సందర్బాలున్నాయని, అది తనకెంతో ఆనందమని వివరించారు. సైద్ధాంతిక నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు గానీ, కేబినెట్ ర్యాంక్ మంత్రిగా గానీ, ఉప రాష్ఠ్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా… ఇలా ఏ పని చేసినా… సమర్థవంతంగా చేశారని, విజయవంతమయ్యారని మోదీ తెలిపారు. ఇన్ని బాధ్యతలు మోసినా… ఎన్నడూ బరువుగా భావించలేదని మోదీ అన్నారు.
ఇంత వయస్సు వచ్చినా… యువతరంతో కలిసిపోయి, పనిచేశారని మోదీ అన్నారు. ఇదో ఉద్వేగపూరిత క్షణమని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బీజేపీ అధ్యక్షుడితో పాటు అనేక ఉన్నత పదవులు చేపట్టారని మోదీ హర్షం వ్యక్తం చేవారు. యువ ఎంపీలను కూడా ఆయనెంతో ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఆయన వాక్ చాతుర్యం, వేగం, వ్యంగ్యం, గంభీరత… అందరికీ ఆదర్శమని తెలిపారు.