టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కడలి జయసారథి(80) కన్నుమూశాడు. జయసారథి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో 1942 జూన్ 26న జన్మించాడు. అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన ‘వెలుగు నీడలు’ చిత్రంతో ఈయన సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘మనఊరి రామాయణం’, ‘బొబ్బిలి బ్రహ్మణ’, ‘డ్రైవర్ రాముడు’, ‘భక్త కన్నప్ప’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన చివరగా సుమన్, రంభ హీరో హీరోయిన్లుగా నటించిన ‘హలో అల్లుడు’ సినిమాలో డాక్టర్ పాత్రలో నటించాడు. జయసారథి దాదాపు 372 సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అంతేకాదు తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు. గత కొద్ది రోజులగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జయసారథి.. చికిత్స పొందుతూనే సిటీ న్యూరో హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచాడు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుతున్నారు. జయసారథి అంత్యక్రియలు ‘మహా ప్రస్థానం’లో జరుగనున్నాయి.
