ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ముందు ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా హైదరాబాద్ లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే… బీజేపీలో చేరక ముందు, బీజేపీలో చేరిన తర్వాత… అంటూ పలువురు బీజేపీ నేతల ఫొటోలతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందులో జ్యోతిరాదిత్య సింధియా, హిమంత బిశ్వశర్మ, సువేందు అధికారి, సుజనా చౌదరి, నారాయణ రాణె ఫోటోలున్నాయి.
సీబీఐ రైడ్స్‌కు ముందు, తర్వాత రంగు మారినట్లు చూపించారు. తెలంగాణలో కవిత మాత్రం రైడ్స్‌కు ముందు, తర్వాత ఒకేలా ఉన్నారని.. అసలైన రంగులు వెలవంటూ పేర్కొన్నారు. చివర్లో బైబై మోదీ (#Bye Bye Modi) అంటూ హ్యాష్ టాగ్‌తో పోస్టర్లను అంటించారు. ఇప్పుడీ పోస్టర్లు నగరంలో ఆసక్తికరంగా మారాయి. అయితే… ఈ పోస్టర్లను ఎవరు అతికించారో మాత్రం తెలియదు.
లిక్కర్ స్కాంలో విచారణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కారులో చేరుకున్నారు. ఈ సందర్భంగా కవిత కారుతో పాటు మరొక కారుకు మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు.ఈడీ విచారణకు బయల్దేరిన సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు జై కవిత… జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈడీ కార్యాలయంలోకి విచారణ నిమిత్తం వెళ్లే ముందుకు కార్యకర్తలకు అభివాదం చేశారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేస్తే ఆందోళనలు చేసే అవకాశం ఉందని వచ్చిన సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో చాలాచోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు సీఎం కేసీఆర్ నివాసం వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ జాగ్రత్తలతో పాటు మరికొన్ని హెచ్చరికలు కూడా ఢిల్లీ పోలీసులు చేశారు. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ప్రకటించారు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ ఈడీ ఆఫీస్ పరిసరాల్లో ఉండొద్దని.. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా ముందస్తు చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.