రేపటితో పదవీ కాలం ముగియనున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోకసభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ ప్రసంగించారు. రాజకీయాలకు అతీతంగా ఎదగాలని నేతలకు సూచించారు. దేశ ప్రయోజనాలను లెక్కలోకి తీసుకుంటూ, ప్రజలకు ఏది అవసరమో… వారి సంక్షేమం కోసం ఏది చేయాలో అదే చేయాలన్నారు.
పార్లమెంట్ నడిచే సమయంలో శాంతంగా చర్చలు జరగాలని, ఈ సమయంలో గాంధీ సిద్ధాంతాన్ని ఫాలో అయితే బాగుంటుందన్నారు. వివిధ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమని, అయినా… దేశ ప్రయోజనాల కోసం కలిసే పనిచేయాలని కోవింద్ ఎంపీలకు సూచించారు. తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ని సంవత్సరాల పాటు దేశ రాష్ట్రపతిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 25 న తదుపరి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు.