ఐదేళ్ల తన పదవీ కాలం పూర్తి సంతృప్తిగా సాగిందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. తాను సాధారణ కుటుంబం నుంచే వచ్చానని, భారత ప్రజాస్వామ్యం అందరికీ అవకాశాలిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి హోదాలో జాతిని ఉద్దేశించి రాంనాథ్ వీడ్కోలు ప్రసంగం చేశారు. 21 శతాబ్దం భారవతావనిదేనని స్పష్టం చేశారు. మన భవిష్యత్తు తరాలకు పర్యావరణ ఫలాలను అందించాలని కోరారు. గాలి, భూమి, నీరు, చెట్లు… వీటిని భవిష్యత్తు తరాలకు అందజేయాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు ఈ గ్రహం భవిష్యత్తు పాలిట పెనుభూతంగా మారాయని, మన పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చుకుందాం… దేశ ప్రథమ పౌరుడిగా.. ప్రజలను కోరేది ఇదే అంటూ పిలుపునిచ్చారు. ప్రజారోగ్యం, వైద్య రంగంలో వనరుల కల్పన ఆవశ్యకతను కోవిడ్ మహమ్మారి ఓసారి గుర్తు చేసిందని, అందుకే కేంద్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యతా రంగంగా వైద్య రంగాన్ని ఎంచుకుందని వివరించారు.
ఇక…. 21 వ శతాబ్దంలోకి భారత్ ను తీసుకెళ్లడానికి జాతీయ విద్యా విధానం కూడా దోహదపడుతుందని రాష్ట్రపతి తన వీడ్కోలు ప్రసంగంలో పేర్కొన్నారు. యువతరం తాము పుట్టి పెరిగిన ఊరితోనూ, గురువులు, పెద్దలతో అనుబంధాన్ని కొనసాగించాలని సూచించారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక తన సొంతూరు పర్వౌంఖలో తన గురువులు, పెద్ద పాదాలకు నమస్కరించడం ఇప్పటికీ మరిచిపోలేనని గుర్తు చేసుకున్నారు. భారత్ లో నాయకత్వానికి ఢోకాయే లేదని, అనేక మంది నాయకులు ప్రతి తరంలోనూ దేశానికి మార్గదర్శనం, సేవలు చేస్తూనే వున్నారన్నారు. జవాన్లు, పారామిలటరీ, పోలీసులను… ఇలా దేశ రక్షణ రంగంలో సేవలందిస్తున్న వారిని కలుసుకున్న ప్రతిసారీ… స్ఫూర్తిమంతంగా వుండేదన్నారు. మూలాలతో ప్రతి ఒక్కరు కూడా అనుబంధాన్ని కొనసాగించాలని, అదే భారతీయ ధర్మంలో ఓ ప్రత్యేకత అని వివరించారు.
దేశ పౌరులు మహాత్మా గాంధీ జీవితం, బోధనలను ప్రతి రోజూ కనీసం కొన్ని నిమిషాలైన చదవాలని, ఆలోచించాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సూచించారు. స్వేచ్ఛ, సమానత్వం అనే ఆదర్శాలు మన దేశంలో ఎంతో ఉన్నతమైనవని, ఎప్పటికీ ఇవి అడ్డంకులు కావని పేర్కొన్నారు. సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడే సాగించలేదని, ఇదే విషయాన్ని అంబేద్కర్ కూడా విశ్వసించేవారని గుర్తు చేసుకున్నారు. ఇక…. 19 వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా అనేక తిరుగుబాట్లు జరిగాయని, మన దేశం కోసం పోరాడిన చాలా మంది యోధుల పేర్లను మరిచిపోయామన్నారు. అందుకు… ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వారి గాథలను గుర్తుచేసుకునే అవకాశం మనకు దక్కిందన్నారు. 21 వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా మార్చుకునేందుకు దేశం సన్నద్ధమవుతోందన్నారు. తన ఐదేళ్ల పదవీ కాలం శక్తిమేరకు నిర్వర్తించానని, దేశ ప్రజలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని తాను కోరుకుంటున్నానని కోవింద్ తన ఉపన్యాసాన్ని ముగించారు.