దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓట్లు వేస్తున్నారు. మరో వైపు వివిధ రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైపోయింది. ఏపీలో సీఎం జగన్ అసెంబ్లీ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక.. తెలంగాణలో మంత్రి కేటీఆర్ తొలి ఓటు వేశారు.
అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంతకు ముందు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక… సీఎం కేసీఆర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ప్రస్తుతం ఆయన భద్రాచలం, ఏటూరు నాగారం వరద ముంపు గ్రామాల పర్యటనలో వున్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ కు సీఎం కేసీఆర్ తిరుగు ప్రయాణమయ్యారు.