భారత రాష్ట్రపతి ఎవరో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. సాయంత్రం కల్లా ఫలితాలు వెలువడతాయి. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే… ముర్ముకు అవసరమైన మెజారిటీ వుండటంతో ఆమెయే రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించనున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. ఎంత మెజారిటీ అన్నది మాత్రం చూడాలి. ముర్ము గనక గెలిస్తే… అత్యున్నత రాష్ట్రపతి పీఠం ఎక్కిన తొలి గిరిజన మహిళగా రికార్డుల్లోకి ఎక్కుతారు.
మరోవైపు అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు పార్లమెంట్ హౌజ్ కు చేరుకున్నాయి. వాటిని లెక్కించడమే తరువాయి. ప్రస్తుతం రాష్ట్రపతిగా వున్న రాంనాథ్ కోవింద్ పదవీ కాలం మరో 3 రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25 న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం వుంటుంది. మరోవైపు సంబరాలు చేసుకోవడానికి ముర్ము సొంత గ్రామ ప్రజలు సిద్ధమైపోయారు. 20 వేల లడ్డూలను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా ముర్ముకు అభినందనలు తెలుపడానికి 100 బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత స్వీట్లు పంపిణీ చేసేందుకు రాయంగపూర్ గ్రామ ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. విజయోత్సవ ఊరేగింపు, గిరిజన డ్యాన్సులను కూడా ఏర్పాటు చేశారు.