నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 21 వ శతాబ్దంలో భారత్ కి కొత్త దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2030 నాటికి ఎనర్జీ మిక్స్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని పెంచడానికి తమ ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేస్తుందని ప్రకటించారు. కర్నాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ (IEW – 2023) సదస్సును ప్రారంభించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023 కార్యక్రమంలో.. ఇండియన్ ఆయిల్ అభివృద్ధి చేసిన సోలార్ కుకింగ్ సిస్టమ్ ట్విన్-కుక్‌టాప్ మోడల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. భారతదేశం యొక్క G-20 ప్రెసిడెన్సీ క్యాలెండర్‌లో ఇది మొదటి ముఖ్యమైన శక్తి ఈవెంట్ అని కొనియాడారు.
కొత్త శక్తి వనరులను అభివృద్ధి చేయడంలో, శక్తి పరివర్తనలో భారతదేశం నేడు బలమైన దేశాలలో ఒకటిగా ఉందని.. అగ్రస్థానానికి తీసుకెళ్లేందు ప్రయత్నాలు చేస్తున్నామంటూ వివరించారు. భారత్ G20 ప్రెసిడెన్సీ క్యాలెండర్‌లో ఇది మొదటి ప్రధానమైన ఈవెంట్ అంటూ పేర్కొన్నారు. ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నాన్నారు. బెంగళూరు సాంకేతికత, ప్రతిభ, ఆవిష్కరణల శక్తితో నిండిన నగరం అంటూ మోడీ కొనియాడారు. నిరంతరం యువ శక్తిని ఉపయోగించుకుంటూ ఉండాలంటూ సూచించారు. స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం, స్థిరమైన సంస్కరణలు.. అట్టడుగు స్థాయిలో సామాజిక-ఆర్థిక సాధికారత అనే మూడు అంశాల గురించి వివరించారు. ఇటీవల, IMF 2023 వృద్ధి అంచనాను విడుదల చేసిందని.. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని పేర్కొందని తెలిపారు.
దేశంలో అత్యధిక పునరుత్పాదక ఇంధన తయారీదారుగా కర్నాటక నిలబడిందని సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు & EV ప్రయాణికులు కర్ణాటకలో ఉన్నారని తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన EV పాలసీని తీసుకొచ్చామని, ఇథనాల్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. 2025 నాటికి 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.