మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. ముందు నుంచి కూడా కాంగ్రెస్ ఇలాకా కావడంతో దానిని కాపాడుకోవాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. మునుగోడుపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనరసింహ, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, మధుయాస్కీ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి, ప్రియాంకతో సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు ప్రియాంకతో తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ కష్టకాలం ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో కుమ్ములాటలు ఏమాత్రం సరికాదని ప్రియాంక వారికి హితవు పలికారు.
అందరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలని, తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక… నల్లగొండ జిల్లా పార్టీ సీనియర్లతో చర్చించి, మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేయాలని, పకడ్బందీగా అభ్యర్థి ఎంపిక చేయాలని ప్రియాంక సూచించారు. ఇక… వారంలోగా అభ్యర్థి ఎంపికను పూర్తి చేయాలని, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తాను కచ్చితంగా వస్తానని ప్రియాంక ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక… తాను ఈ సమావేశానికి రాలేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్ఠానానికి తెలియజేశారు. అయితే… కోమటిరెడ్డిని కూడా పార్టీలో కలుపుకు పోవాలని, ఇబ్బందులు పడొద్దని తెలంగాణ నేతలకు ప్రియాంక సూచించారు.