కార్తికేయ 2 గురించి ఎంత చెప్పినా సరిపోదని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొనియాడారు. హిందీలో 50 థియేటర్ లలో రిలీజ్ చేద్దామనుకుంటే ఇప్పుడు 700 థియేటర్ లలో నడుస్తుందని అన్నారు . సత్తా లేకపోతే ఏ సినిమా ఆడదని.. ఆ సత్తా కార్తికేయ 2కు ఉంది కనుకే బాలీవుడ్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోందని అభిప్రాయపడ్డారు.ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వెంచర్ ఫిల్మ్ కి పౌరాణికం జోడించి తీయడం అంత ఈజీ కాదన్నారు. ఇలాంటి సినిమా తీయాలంటే ఎంతో ఆలోచించి ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ భయాందోళనల్లో ఉందని, సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా లేదా అనే సందేహం కలుగుతోందని చెప్పారు. కానీ ఈ మధ్య వచ్చిన 3 సినిమాలతో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎంత దూరమైనా వస్తారని అర్థం అయిందని అన్నారు.
