నటుడు శివాజీ గణేషన్ ఇంట్లో ఆస్తుల వివాదాలు ప్రారంభమయ్యాయి. సోదరులు ప్రభు, రామ్ కుమార్ తండ్రి ఆస్తిలో తమకు వాటా ఇవ్వడం లేదని శివాజీ గణేషన్ కుమార్తెలు శాంతి, రిజ్వీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి మరణం తర్వాత 270 కోట్ల ఆస్తులను సక్రమంగా ఉపయోగించడం లేదని, అందులో తమకు వాటా ఇవ్వడం లేదని కుమార్తెలు హైకోర్టులో పేర్కొన్నారు. అలాగే తమకు తెలియకుండానే ఆస్తులను కూడా విక్రయించేశారని, అలా చేయడం కుదరదని హైకోర్టు ప్రకటించాలని విన్నవించారు.
అంతేకాకుండా వెయ్యి సవర్ల బంగారు నగలు, ఇతరత్రా వెండి వస్తువులను ప్రభు, రామ్ కుమార్ ఇద్దరూ అపహరించారని గణేషన్ కుమార్తెలు ఆరోపిస్తున్నారు. నకిలీ పత్రాలు చేసి, అవి శివాజీ గణేషన్ రాసినట్లు మోసం చేస్తున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కుమార్తెలు మద్రాసు హైకోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా ఈ కేసులో ప్రభు, రామ్ కుమార్ కుమారులను కూడా ప్రతివాదులుగా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.