ప్రభుత్వ ఉపాధ్యాయులకు సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. దీనికి సంబంధించి టీచర్లను సింగపూర్ పంపించారు. 36 మంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ప్రభుత్వం సింగపూర్ పంపింది. ఈ పర్యటనను సీఎం భగవంత్ మాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 6 నుంచి 10 వరకూ సింగపూర్ లో జరిగే ప్రొఫెషనల్ టీచర్ ట్రైనింగ్ సెమినార్లో వీరందరూ పాల్గొంటారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా మార్చేస్తామని, ఢిల్లీ తరహా విద్యా విధానాన్ని తీసుకొస్తామని ఆప్ హామీ ఇచ్చింది. అందుకే సింగపూర్ విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు 36 పాఠశాలల ప్రధానోపాధ్యాయుల మొదటి బ్యాచ్ సింగపూర్ వెళ్తోందని సీఎం తెలిపారు. సింగపూర్ లోని ప్రిన్సిపల్స్ ను అక్కడి విద్యా విధానాన్ని అడిగి తెలుసుకుంటారు. తిరిగి భారత్ కి వచ్చేసి… ఇక్కడి ఉపాధ్యాయులతో అనుభవాలు పంచుకోనున్నారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామనే ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చామని అది నెరవేర్చుకోవటానికి ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్రం విద్యారంగంలో విప్లవ వాగ్దానం నెరవేర్చటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యా విధానంలో విప్లవం రావాలంటే..మొదటగా ఉపాధ్యాయుడు, పిల్లల తల్లిదండ్రుల మధ్య అంతరం తొలగిపోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను స్కూల్ కు పంపించటమే బాధ్యత కాదని పిల్లలు ఎలా చదువుతున్నారో నిరంతరం గమనిస్తుండాలని సూచించారు. పిల్లల చదువుల విషయంలోనే కాదు వారి ప్రవర్తన ఎలా ఉంటోంది? అనేది కూడా గమనించాలన్నారు.