రష్యాలో జనాభా తగ్గిపోవడంపై ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చారు. 10 మంది పిల్లల్ని కని, వారిని పోషించే తల్లులకు 13 లక్షల సాయం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా మదర్ హీరోయిన్ అన్న అవార్డును కూడా అందజేస్తామని ప్రకటించారు. ఈ అవార్డు సోవియెట్ కాలం నాటిది. జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ అవార్డును పుతిన్ మళ్లీ తెరపైకి తెచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా జనాభా తగ్గిపోవడంతో స్టాలిన్ ఈ అవార్డును ప్రకటించారు. 1991 లో రద్దు చేస్తే.. పుతిన్ మళ్లీ తెచ్చారు. పుతిన్ ఉత్తర్వుల ప్రకారం… 10 మంది పిల్లలను కంటే ఈ అవార్డు ఇస్తామని, పదో బిడ్డ మొదటి జన్మదినం రోజున ఆ తల్లికి అవార్డును, 13 లక్షలను ఇస్తారు. అయితే, అప్పటివరకూ 10 మంది పిల్లలూ బతికి ఉండాలన్న షరతు పెట్టారు. ఒకవేళ ఆ పిల్లల్లో ఎవరైనా యుద్ధంలోనో, టెర్రరిస్ట్ అటాక్లోనో చనిపోతే మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ తో యుద్ధం, కోవిడ్ మరణాల నేపథ్యంలో రష్యా జనాభా బాగా తగ్గిందని అంటున్నారు. ఇదే జనాభా సంక్షోభానికి కారణమని అంటున్నారు. దీంతో గత్యంతరం లేక… ఇలాంటి వినూత్న పథకాల ద్వారా జనాభాను పెంచాలని పుతిన్ వ్యూహం వేశారు. పెద్ద కుటుంబాలు వున్న వారు పెద్ద దేశభక్తులని కితాబునిస్తున్నారు. అయితే… పుతిన్ పెట్టిన మెలిక మాత్రం అంత బాగోలేదని విమర్శలు వస్తున్నాయి. పదో పిల్లవాడి మొదటి జన్మదినోత్సవం నాడు మాత్రమే ఈ 13 లక్షల రూపాయలు వస్తాయి. అప్పటి వరకు ఆ పది మంది చిన్నారులను పోషించే బాధ్యత ఎలా? అన్నది ప్రశ్నార్థకం.