సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరు కావడం, ధరల పెరుగుదల, జీఎస్టీ అంశాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నేడు దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తో పాటు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణ నుంచి విజయ్ చౌక్ వరకూ పాదయాత్ర చేపట్టారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలోనే రాహుల్ గాంధీ పోలీసుల తీరును నిరసిస్తూ ఏకంగా రోడ్డుపైనే బైఠాయించారు.
దీంతో ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై రాహుల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ఓ రాజు తరహాలోనే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే… కనీసం నిరసన తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదని రాహుల్ మండిపడ్డారు.