కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తనకే తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇటాలియన్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పెండ్లి ఎందుకు చేసుకోలేదు..? అని విలేకరి ప్రశ్నించగా.. ‘ఎందుకన్న విషయం తెలియదు. కాకపోతే ఈ విషయం నాకే విచిత్రంగా ఉంది. చాలా పనులు చేయాల్సి ఉంది. నాకు పిల్లలు కావాలని మాత్రం ఉంది’అంటూ చెప్పుకొచ్చారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా గడ్డంతో కనిపించడంపై కూడా రాహుల్ ఈ ఇంటర్వ్యూలో స్పందించారు. యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం తీయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, ఇప్పుడా గడ్డాన్ని ఉంచాలా? తీసేయాలా? అన్న విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక…. దివంగత మాజీ ప్రధాని, తన నానమ్మ ఇందిరాగాంధీకి తానంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక ఇటలీలోని అమ్మమ్మ పావ్‌లామాయినోకు తన సోదరి ప్రియాంక గాంధీ అంటే ప్రాణమని చెప్పుకొచ్చారు.