ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే క్రమంలో ఆయన ఇంటి పేరును తీవ్ర స్థాయిలో విమర్శించడంతో కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్రమైన చిక్కుల్లో పడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్నాటక రాష్ట్రం వేదికగా రాహుల్ చేసిన విమర్శల నేపథ్యంలో ఆయనపై పరువు నష్టం దావా కేసు పడింది. దీంతో ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ కి 2 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చినా తర్వాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి. ఆయన మెడపై అనర్హత కత్తి వేలాడుతోంది. 1951 సెక్షన్ 8(3) ప్రకారం ఏ ఎంపీకైనా సరే ఏదైనా కేసులో 2 సంవత్సరాల కనీస శిక్ష పడితే మాత్రం… అనర్హత వేటుపడి పదవీ కోల్పోతారు.
ఈ లెక్కన చూస్తే రాహుల్ మెడపై కచ్చితంగా అనర్హత అన్న కత్తి వేలాడుతోంది. ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం రాహుల్ ని దోషిగా నిర్ధారించిన క్రిమినల్ పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష అరుదుగా జరిగే ఛాన్స్ వుందన్నారు. ఇప్పుడు గనక రాహుల్ అప్పీల్ కి వెళ్లకపోతే… ఆయన ఎంపీ పదవిని కోల్పోవాల్సి వస్తుంది. పై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే…. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయ స్థానాలకు వెళ్లాలనే కాంగ్రెస్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ ని దోషిగా నిర్ధారించింది. దొంగలందరికీ మోదీ ఇంటిపేరు అంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. 2019 లోకసభ ఎన్నికల సమయంలో కర్నాటకలో జరిగిన ప్రచార సభలో రాహుల్ ఈ విమర్శలకు దిగారు. దీంతో గుజరాత్ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ శిక్ష విధించింది. కాగా రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. కోర్టు నిర్ణయాన్ని సవాలు చేసేందుకు వీలుగా రాహుల్ శిక్షను 30 రోజలుపాటు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే.. కోర్టు ఈ తీర్పు వెలువరించే సమయంలో రాహుల్ గాంధీ కోర్టులోనే వున్నారు. అయితే ఓ రోజు ముందే సూరత్ కి వచ్చిన రాహుల్ కి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. షేర్ హిందుస్తాన్ అంటూ నినాదాలు కూడా చేశారు.