పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ ధన్కర్ తన నివాసంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను తెలియజేశారు. అయితే… అదానీ వ్యవహారంపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. సీబీఐ, ఈడీలను ప్రభుత్వం ఉసిగొల్పుతున్న వైనాన్ని కూడా ప్రశ్నిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. అయితే… మొదటి రోజు సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత విపక్ష పార్టీల సమావేశం జరిగింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
అయితే… అధికార బీజేపీ మాత్రం రాహుల్ టార్గెట్ గా కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ… కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని డిసైడ్ అయ్యింది. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ సభలో ప్రస్తావించింది. ఈ వ్యాఖ్యలపై రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, పార్లమెంట్ వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే బీజేపీ ఈ చర్చను లేవదీసింది.
విదేశీ గడ్డపై భారత దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ కి హాజరై, క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, పీయూశ్ గోయల్, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. పార్లమెంట్ వేదికగా జాతికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లోనూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ అపహాస్యం చేశారని మండిపడ్డారు. చట్ట సభల్లో విపక్ష నేతలు మాట్లాడే ఛాన్స్ లేదంటూ రాహుల్ పేర్కొన్నారని, ఆయనపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని మరో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు.