తనపై అనర్హత వేటు పడిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. తాను దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడానని, పోరాడుతూనే వుంటానని స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు వేసినా, జైలుకే పంపినా… భయపడేదే లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వుంటానని పేర్కొన్నారు. వ్యాపారవేత్త అదానీపై ప్రశ్నించినందుకే కేంద్రం తనపై అనర్హత వేటు వేసిందని ఆరోపించారు. ఇలాంటి అనర్హతల వంటివి తనను ఏమీ చేయలేవని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే వుంటానని స్పష్టం చేశారు.
మన దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని చాలా సార్లు చెప్పానని, ఇప్పుడు దాని ఉదాహరణలు చూస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నించామని, అందుకు ప్రతిగా తనకేం జరిగిందో ప్రజలంతా చూశారన్నారు. పార్లమెంట్ లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, తన ప్రసంగాన్ని కూడా తొలగించారని మండిపడ్డారు. బ్రిటన్ లో తాను అనని మాటలను అన్నట్లు చూపిస్తున్నారని, సాక్షాత్తూ కేంద్ర మంత్రే పార్లమెంట్ లో అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. ఈ దేశ ప్రజలు తనకు అన్నీ ఇచ్చారని, వారి కోసం ఏం చేయడానికైనా రెడీగానే వున్నానని రాహుల్ ప్రకటించారు. తన పేరు సావర్కర్ కాదని, గాంధీ అని, క్షమాపణలు చెప్పే కుటుంబం తనది కాదని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ దృష్టిలో దేశమంటే అదానీ..అదానీ అంటే దేశం అని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశం తనకు ప్రేమ, గౌరవం ఇచ్చిందని అన్నారు. తనకు అండగా నిలిచిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. మోడీకి భయం పట్టుకుందని..ఆయనే విపక్షాలకు ఆయుధం ఇచ్చారని చెప్పారు. అదానీపై తన ప్రసంగాన్ని చూసి మోదీ ఆ రోజు భయపడ్డారని పేర్కొన్నారు. తాను పార్లమెంట్ లో మాట్లాడితే… మరిన్ని విషయాలు బయటకు వస్తాయన్న భయంతోనే కేంద్రం ఇలా చేసిందని రాహుల్ ఆరోపించారు.