తన లోక్ సభ సభ్యత్వం రద్దు కావడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత వాణిని వినిపించేందుకే తాను పోరాటం చేస్తున్నానని ట్వీట్ చేశారు. అందుకోసం ఎంతటి మూల్యమైనా చెల్లించేందుకు రెడీగా వున్నానని, ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమేనని ట్వీట్ చేశారు.
मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं।
मैं हर कीमत चुकाने को तैयार हूं।
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ సెక్రెటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు ఉపక్రమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 స్థానాల నుంచి బరిలోకి దిగారు. ఎప్పటి లాగే అమేథీ నుంచి బరిలో వున్నా… రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేరళలోని వయనాడ్ నుంచి కూడా బరిలో నిలిచారు.అయితే అమేధీ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపొందగా… రాహుల్ ఓడిపోయారు. అయితే… రెండో స్థానమైన వయనాడ్ నుంచి గెలుపొందారు.
2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ కర్నాటకలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మోదీ ఇంటిపేరున్న వారందరూ దొంగలే అంటూ విమర్శలు చేశారు .దీంతో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై సూరత్ కోర్టు గురువారం వాదనలు విని, రాహుల్ కి 2 సంవత్సరాల పాటు జైలుశిక్ష విధించింది. అయితే సూరత్ కోర్ట్ ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే లోక్ సభ సచివాలయం రాహుల్ పై అనర్హత వేటు వేసింది.