ఈ సారి తీసుకొచ్చిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్డెట్ కింద 12,824 కోట్లను కేటాయించామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. తెలంగాణకు 4,418 కోట్లు, ఏపీకి 8,406 కోట్లను ఇచ్చామని పేర్కొన్నారు. అయితే… భూసేకరణ లాంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం బాగా లభిస్తోందని, అందుకే ఎక్కువ కేటాయింపులు అని వివరించారు. హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అన్న నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
ఎంఎంటీఎస్ రెండో దశకు ఈ యేడాది 600 కోట్లు కేటాయించామన్నారు. రెండు ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా సహకారం అందించాలని అశ్వనీ వైష్ణవ్ కోరారు. విశాఖ జోనల్ కార్యాలయం భవనం డిజైన్ ను త్వరలో ఖరారు చేసి, నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ప్రకటించారు. కాజీపేటకు వ్యాగన్ ఓవర్ హాలింగ్, రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చామన్నారు. తర్వాత అక్కడ వ్యాగన్ తయారీని జతచేస్తామని ప్రకటించారు.
హైదాబాద్– విశాఖ వందే భారత్ ట్రైన్ కు మంచి స్పందన వస్తోందని, ఈ ట్రైన్ అక్యుపెన్సీ రేటు 120 శాతంగా ఉందని రైల్వే మంత్రి చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా తెచ్చిన వందే భారత్ ట్రైన్స్ సక్సెస్ కావడంతో ఈ ఏడాదే వందే మెట్రో కాన్సెప్ట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో దగ్గరి ప్రయాణాలకు రీజినల్ షటిల్ ట్రైన్స్ గా వీటిని తీసుకొస్తున్నామన్నారు. రీజినల్ ట్రైన్స్ తక్కువ స్పీడ్తో నడుస్తాయని, భిన్నమైన సీటింగ్, టాయిలెట్స్ ఉంటాయని చెప్పారు.
కేంద్ర బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.13,786.19 కోట్లు కేటాయించారని, గతేడాదితో పోలిస్తే 65% ఎక్కువని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. ఇందులో తెలంగాణకు రూ.4,418 కోట్లు అలాట్ చేశారని, గతేడాదితో పోలిస్తే ఇది 45% ఎక్కువని చెప్పారు.