అగ్నివీరుల నియామకంలో కే్ంద్రం కులానికి ప్రాధాన్యత ఇస్తోందన్న విపక్షాల విమర్శలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. అగ్నివీరుల నియామకంలో కులానికి ప్రాధాన్యత అంటూ అనవసర ప్రచారం చేస్తున్నారని, అవన్నీ పుకార్లేనని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ సైనిక నియామక ప్రక్రియ స్వాతంత్ర్యం ముందు నుంచీ కొనసాగుతోందని, అందులో ఎలాంటి మార్పు చేర్పులూ చేయలేదని రాజ్ నాథ్ తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఎవ్వరూ పట్టించుకోవద్దని రాజ్ నాథ్ పిలుపునిచ్చారు.
అగ్నివీరుల నియామకంలో కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శలు చేస్తున్నారు. నాలుగేళ్ళ తర్వాత సైన్యంలోకి తీసుకునే 25 శాతం మందిలో అగ్రకులాలు, మతాల వారే ఉంటారని పేర్కొన్నారు. సైన్యంలో రిజర్వేషనే లేనప్పుడు కాస్ట్ సర్టిఫికెట్ ఎందుకంటూ తేజస్వీ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే రాజ్ నాథ్ పై విధంగా క్లారిటీ ఇచ్చారు. ఇక… ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఘాటుగా స్పందించారు. నియామక ప్రక్రియపై వస్తున్న విమర్శలు సైన్యాన్ని అవమాన పరిచే విధంగా ఉన్నాయన్నారు. యువతను నిరసనలకు దిగేలా రెచ్చగొట్టేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.