వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడం, సభా మర్యాదను ఉల్లంఘించేలా ప్రవర్తించారని 19 మంది రాజ్యసభ ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు. వారం వరకూ ఈ ఎంపీలు సభకు హాజరు కావొద్దని ఆదేశించారు. టీఎంసీకి చెందిన 7 గురు, డీఎంకేకి చెందిన 6 గురు, సీపీఎంకి చెందిన ఇద్దరు, టీఆర్ఎస్ కి చెందిన ముగ్గురు ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు. ఎంపీలకు సంబంధించిన సస్పెన్షన్ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ సభలో ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులు తక్షణమే సభను వీడాలని ఆదేశించారు. బడుగుల లింగయ్య, రవిచంద్ర వద్దిరాజు, దామోదర్ రావుతో పాటు సుస్మితా దేవ్, శాంతాను సేన్, డోలాసేన్, కనిమొళి, మౌసుమ్ నూర్, శాంతాఛత్రీ, నదీముల్, రహీమ్, గిరిరాజన్, అభిరంజన్ బిస్వార్, కల్యాణ సుందరం, ఇళంగోవన్ తదితర ఎంపీలు వున్నారు. అయితే… సభను వీడకుండా వీరందరూ అక్కడే నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. దీంతో గంటపాటు సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.