శ్రీలంకలో నిరసనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పదవికి రణిల్ విక్రమ సింఘే రాజీనామా చేసి, సంచలనం
సృష్టించారు. ఆర్థిక పరిస్థితులను నిరసిస్తూ.. ప్రజలు అధ్యక్షుడు గొటబోయ నివాసాన్ని చుట్టుముట్టిన కాసేపటికే.. రణిల్ రాజీనామా చేయడం గమనార్హం. స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాతే విక్రమ సింఘే తన రాజీనామాను ప్రకటించారు.
అఖిలపక్ష ప్రభుత్వాన్ని దేశంలో ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా ప్రధాని, అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విక్రమ సింఘే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దేశ ప్రజల భద్రత సహా ప్రభుత్వ కొనసాగింపు కోసం నేను ఈ రోజు పార్టీ నాయకుల సిఫార్సును అంగీకరిస్తూ.. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నానని విక్రమ సింఘే ట్వీట్ చేశారు.