శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. శ్రీలంక అధ్యక్షుడిగా గొటబయ రాజపక్స రాజీనామా చేయడంతో.. కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగే వరకూ విక్రమ సింఘే బాధ్యతల్లో వుంటారని స్పీకర్ మహింద యప అబెవర్దన ప్రకటించారు. శనివారం పార్లమెంట్ సమావేశం అవుతుందని, వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రకటించారు.
అధ్యక్ష పదవికి జూలై 19 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, 20 న సభ్యులు కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకుంటారని స్పీకర్ పేర్కొన్నారు. పార్లమెంట్ అధికారాలను బలోపేతం చేసేలా 19 వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరిస్తామని, శాంతిభద్రతలను కాపాడతామని స్పీకర్ పేర్కొన్నారు. మరోవైపు దేశాన్ని రక్షించుకోవడానికి ఆ దేశ యువత ముందుకు వచ్చింది. దేశం కోసం ఫండ్స్ సహకరిస్తోంది. శ్రీలంక హ్యాష్ ట్యాగ్ తో ఈ ఫండ్స్ వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు.