శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. బుధవారం లంక పార్లమెంట్ లో జరిగిన ఎన్నికల్లో ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో అధ్యక్ష పీఠం పై విక్రమ సింఘే కూర్చున్నారు. శ్రీలంక పార్లమెంట్ లో మొత్తం 219 మంది వుండగా.. 134 మంది విక్రమ సింఘేకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అధ్యక్ష పీఠం ఆయన్నే వరించింది. రహస్య బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలు జరిగాయి. రణిల్ విక్రమ సింఘే, డల్లాస్ అలహప్పెరుమా మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 225 ఓట్లు కాగా… 4 ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో ఇద్దరు ఓటు వేయడానికే రాలేదు. దీంతో మొత్తం 219 ఓట్లకు గాను 134 ఓట్లు విక్రమ సింఘేకి వచ్చాయి. అలహప్పెరుమాకు 82 ఓట్లు మాత్రమే వచ్చాయి.
శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి రాజపక్సే కుటుంబమే కారణమని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అధ్యక్షుడు రాజపక్సే అధికార నివాసాన్ని కూడా ముట్టడించారు. దీంతో ఆయన నివాసం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత గొటబాయ రాజపక్సే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. దీంతో కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 73 ఏళ్ల విక్రమ సింఘేకు అపార రాజకీయ, పాలనాపరమైన అనుబవం వుంది. 6 సార్లు దేశ ప్రధానిగా కూడా సేవలందించారు.