కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, దానిపై వివరణ ఇచ్చుకోవాల్సింది సావర్కర్ ని నిందించారు రాహుల్. ఇప్పుడు ఆ మాటలే బెడిసికొడుతున్నాయి. రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ డిమాండ్ చేశారు. లేదంటే కేసు పెడతానని హెచ్చరించారు.
ఉద్ధవ్, రౌత్, పవార్ ముగ్గురికీ సావర్కర్ అంటే అభిమానమని చెప్పుకుంటారు కదా… ఆ ముగ్గురూ రాహుల్ తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. తన స్వార్థ రాజకీయ కోసం సావర్కర్ ని రాహుల్ విమర్శిస్తున్నారని, ముస్లింల ఓట్ల కోసమే రాహుల్ ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రంజిత్ సావర్కర్ పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలు చిన్నపిల్లల వ్యాఖ్యల్లా వున్నాయని ఎద్దేవా చేశారు.
మోదీ అనే ఇంటిపేరును 2019 ఎన్నికల ప్రచార సభలో రాహుల్ కించపరిచినట్లు మాట్లాడారు. దీంతో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల పాటు జైలు శిక్ష పడింది. దీంతో లోక్ సభ సభ్యత్వం కూడా రాహుల్ ది రద్దైపోయింది. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను సావర్కర్ ని కానని, గాంధీని అని గాంధీలు క్షమాపణలు చెప్పరని వ్యాఖ్యానించారు.
మన దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని చాలా సార్లు చెప్పానని, ఇప్పుడు దాని ఉదాహరణలు చూస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నించామని, అందుకు ప్రతిగా తనకేం జరిగిందో ప్రజలంతా చూశారన్నారు. పార్లమెంట్ లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, తన ప్రసంగాన్ని కూడా తొలగించారని మండిపడ్డారు. బ్రిటన్ లో తాను అనని మాటలను అన్నట్లు చూపిస్తున్నారని, సాక్షాత్తూ కేంద్ర మంత్రే పార్లమెంట్ లో అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. ఈ దేశ ప్రజలు తనకు అన్నీ ఇచ్చారని, వారి కోసం ఏం చేయడానికైనా రెడీగానే వున్నానని రాహుల్ ప్రకటించారు. తన పేరు సావర్కర్ కాదని, గాంధీ అని, క్షమాపణలు చెప్పే కుటుంబం తనది కాదని పేర్కొన్నారు.