తిరుమల లో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమల మాఢ వీధులు గోవిందనామ స్మరణతో మారుమ్రోగాయి. శనివారం తెల్లవారు జాము నుంచి శ్రీ మలయప్పస్వామి వివిధ రూపాల్లో సప్త వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఊరేగారు. సాయంత్రం కల్పవృక్ష వాహనంపై విహరించారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు కనులార దర్శనం ఇచ్చారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరంలో చదుకుంటున్న వందమందికి పైగా విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయం, సూర్యాష్టకం సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాఢ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జేఈవోలు సదా భార్గవి,వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. కొవిడ్ తరువాత మొదటిసారి ఆలయ మాడవీధుల్లో జరుగుతున్న రథసప్తమి వాహనసేవలకు విశేషంగా భక్తులు తరలివచ్చారు. కొవిడ్ తరువాత మొదటిసారి ఆలయ మాడవీధుల్లో జరుగుతున్న రథసప్తమి వాహనసేవలకు విశేషంగా భక్తులు తరలివచ్చారు.
