ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించారు. 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచినట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీంతో రెపోరేటు 6.50 శాతానికి చేరినట్లయింది. రెపో రేట్ల పెంపుకు మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు సమర్థించారని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు ద్రవ్యపరపతి విధానాన్ని సవాలుగా మార్చేశాయని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు సర్దుబాటు వైఖరిని తిరిగి కొనసాగించాలని భావించినట్టు, అందులో భాగంగానే రెపో రేటు పెంపునకు నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు.
చాలా రంగాల్లో భారత్ భాగస్వామ్యం కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ అప్రమత్తంగానే వుందన్నారు. తగినంత నగదు ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో వుందని ప్రకటించారు. రెపో రేటు పెరగడంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం పడనుంది. లోన్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అంతేకాకుండా నెలవారీ ఈఎంఐలు మరింత పెరిగే ఛాన్సుంది. అలాగే రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంటాయి. దీంతో లోన్లు మరింత భారం కానున్నాయి. అయితే రెపో రేటు పెరగడం వల్ల బ్యాంకుల్లో నగదు దాచుకునే వారికి వడ్డీ రేట్లు పెరగనున్నాయి.