టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్న పాత్రుడి ఇంటి కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. ఈ విషయాన్ని వెంటనే స్థానిక అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఇంటి జోలికి వెళ్లొద్దని అధికారులను హెచ్చరించింది.
అయ్యన్న ఇంటి కూల్చివేతపై ఆయన తరపు న్యాయవాదులు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జలవనరుల శాఖ తంలో అనుమతి ఇచ్చినా… ఎలాంటి నోటీసులు లేకుండా ఇల్లు కూల్చేస్తున్నారని అయ్యన్న పాత్రుడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
మరోవైపు అయ్యన్న పాత్రుడి ప్రహారీ గోడ కూల్చివేతను నిరసిస్తూ టీడీపీ ఛలో నర్సీపట్నంకు పిలుపునిచ్చింది. వైసీపీ అరాచకాలను ప్రశ్నించినందుకే సీఎం జగన్ ఇలా చేశారంటూ ఏపీ టీడీపీ తీవ్రంగా మండిపడ్డ విషయం తెలిసిందే. దీంతో తాము ఛలో నర్సీపట్నానికి పిలుపునిస్తున్నట్లు టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.