విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో 10 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఏపీతో, ఇక్కడి ప్రజలతో తమ అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో జియోకి సంబంధించిన డిజిటల్ నెట్ వర్క్ సదుపాయాల కల్పనకై 40 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ జనాభాలో 98 శాతం 4జీ నెట్ వర్క్ కవర్ చేస్తోందని, ఇప్పుడు ట్రూ 5జీ సేవలను 2023 చివరి నాటికల్లా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని ప్రకటించారు.
ఏపీలో పుష్కలంగా సారవంతమైన భూములు, సహజ వనరులు, నైపుణ్యం, వున్నాయని, విశాఖలో అందమైన బీచ్ లు వున్నాయని తెలిపారు. ఏపీలోని 6 వేల గ్రామాల్లో 1.2 లక్షల కిరాణా వ్యాపారులతో రిలయన్స్ రిటైల్ భాగస్వామిగా వుందన్నారు. కొత్త డిజిటల్ యుగంలో అవసరమైన సాధనాల్ని సమకూర్చిందని పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్ ద్వారా ఏపీలో ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా అధిక మందికి ఉపాధి దొరుకుతోందని వివరించారు. ఏపీ నుంచి సేకరిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల్ని, హస్త కళాకారుల ఉత్పత్తుల్ని రిలయన్స్ దేశమంతా విక్రయిస్తోందన్నారు.
ఏపీలో మౌలిక సదుపాయాలు, ఫార్మాస్యూటికల్స్ రంగాలు దూసుకెళ్తున్నాయన్న రిలయన్స్ అధినేత.. ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు, డాక్టర్లు, వివిధ రంగాల్లో ఏపీ వాళ్లు ఉన్నారని చెప్పారు. రిలయన్స్ సంస్థలో కూడా చాలా మంది మేనేజర్లు, ప్రొఫెషనల్స్ ఏపీ వాళ్లు ఉన్నారని తెలిపారు. మెరైన్ రంగంలో ఏపీ బాగా అభివృద్ధి సాధించగలదని తెలిపిన ఆయన… ప్రధాని మోదీ వల్ల దేశం దూసుకెళ్తోందనీ.. అలాగే సీఎం జగన్ వల్ల ఏపీ ముందుకెళ్తోందని అన్నారు. ఏపీ ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తుందనే బలమైన నమ్మకం ఉందన్న రిలయన్స్ చీఫ్… 2002 నుంచి సహజ వాయువు రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెడుతోందనీ.. దేశంలో 30 శాతం గ్యాస్ ఉత్పత్తి ఏపీ నుంచే ఉందని ముఖేష్ అంబానీ తెలిపారు.