పీసీసీ అధ్యక్ష పీఠం తనకు ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జీవితాంతం రుణపడి వుంటానని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాముడి లాంటి రాహుల్ కి, హనుమంతుడిలా పనిచేస్తానని, వానర సైన్యం లాంటి కార్యకర్తల సహకారంతో రావణుడు లాంటి కేసీఆర్ ను ఓడించేందుకు యుద్ధం చేస్తామని ప్రకటించారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి యేడాది పూర్తైన సందర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ఫలితాల తర్వాత సోనియా గాంధీ సీఎం క్యాండిడేట్ గా ఎవర్ని ప్రకటిస్తే.. వారే సీఎం అవుతారని రేవంత్ సంచలన ప్రకటన చేశారు. తన లక్కీ నంబర్ 9 అని, అందుకే 99 సీట్లలో కాంగ్రెస్ గెలవాలని రేవంత్ కోరుకున్నారు. ప్రభుత్వం గనక అనుమతిస్తే.. పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఏర్పాటు చేసిన దాని కంటే పెద్ద సభనే ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హుజూరాబాద్ కాంగ్రెస్ ఓటమికి తాను కుంగిపోయానని, అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే తనకు అండగా నిలబడ్డారని రేవంత్ అన్నారు.