దాడులు, ప్రతిదాడులతో రగిలిపోతున్న రష్యా, ఉక్రెయిన్ ఎట్టకేలకు ఒక అంశంపై పట్టవీడాయి. ఉక్రెయిన్లో పేరుకుపోయిన ఆహార ధాన్యాల ఎగుమతికి వీలు కల్పించే చరిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఉక్రెయిన్ నుంచి నల్లసముద్రం మీదుగా ఆహార ధాన్యాలను నౌకల్లో తరలించేందుకు ఈ ఒప్పందం వెసులుబాటు కల్పించనుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దండయారత ప్రారంభించిన తరువాత ఇరుదేశాల మధ్య కుదిరిన తొలి ఒప్పందం ఇది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్నవారు కాకుండా అదనంగా 4.7 కోట్లమంది ఆకలిబారిన పడనున్నారని ఐరాస ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. వాస్తవానికి రెండు దేశాలు నేరుగా ఒప్పందంపై సంతకం చేయలేదు. ఇస్తాంబుల్లో జరిగిన కార్యక్రమంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ, ఉక్రెయిన్ మంత్రి ఒలెగ్జాండర్ కుబ్రకోవ్లు వేర్వేరుగా ఒప్పందంపై సంతకం చేశారు. ఐక్యరాజ్యసమితి, టర్కీ, రష్యా, ఉక్రెయిన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
