అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం సోమర్ సెట్ నగరం లో న్యూజెర్సీ తెలుగు కళా సమితి మరియు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్ ) సంయుక్తంగా జూన్ 3 వ తేదీన ప్రత్యేక సాహితీ సమావేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా,సాహిత్య రంగాలలో విశిష్ట కృషి చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ముఖ్య అతిధి గా విచ్ఛేసిన ఈ తెలుగు సాహితీ సమావేశానికి దాదాపుగా 100 మందికి పైగా సాహితీ ప్రియులు 3 గంటల పాటు ఆసక్తితో, ఉత్సాహంగా కదలకుండా కూర్చుని సభని జయప్రదం చేశారు.
కార్యక్రమంలో ముందుగా కల్చరల్ కార్యదర్శి శ్రీమతి బిందు యలమంచిలి ఈ సదస్సు కు విచ్చేసిన వారిని సాదరంగా ఆహ్వానించారు. తరువాత చిరంజీవి శ్రీహన్ గరిమెళ్ళ వినాయక శ్లోకాన్ని శ్రావ్యంగా ఆలపించారు. కమ్యూనిటీ కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి పులిపాక, ప్రముఖ సినీ గేయరచయిత, తెలుగు వేదకవి, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి స్వాగతం పలికి వారిని ఉపన్యసించవలసినదిగా కోరారు.
శతక సాహిత్యంలో ఆయనదైన ప్రత్యేక ముద్ర వేసిన జొన్నవిత్తుల ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను రాసిన శతకాలను గురించి ప్రస్తావించారు.
“చిన్నతనం నుంచి నాకు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది. అందువలన పద్యాలు .. పాటలు రాస్తూ వుండేవాడిని. ఇప్పటికి 24వ శతకాలు రాసాను . ‘దివిసీమ’లో మా అమ్మ పుట్టిల్లు వుంది. ఆ అనుబంధంతో ‘దివిసీమ శతకం’ను రాసి ఆకాశానికి అంకితం ఇచ్చాను. ‘కోనసీమ శతకం’ రాసి వాయుదేవుడికి అంకితం ఇచ్చాను. ‘ఉత్తరాంధ్ర శతకం’ సముద్రుడికి అంకితం ఇచ్చాను. ఇక ‘యజ్ఞేశ్వర శతకం’ను అగ్నిదేవుడికి అంకితం చేశాను. నేను విజయవాడలో పుట్టాను కాబట్టి ‘విజయవాడ శతకం’ రాసాను .. అది భూదేవికి అంకితం చేశాను” అని చెప్పుకొచ్చారు. మనుషులే కాదు, ఒక మంచి పుస్తకం, లేదా ఒక పద్యం, ఒక పాట ఎదురుకావడం కూడా మానవ జీవితంలో ఒక పెద్ద సంఘటనే అని తెలియ చేసారు.
ఇంతమంది తెలుగు భాషాభిమానులు ఈ సాహితీ సమావేశం ఏర్పాటు చేయటం ఒక గొప్ప అనుభూతి అని అన్నారు. తాను రచించిన కోనసీమ శతకం, శ్రీ రామలింగేశ్వర శతకం, తెలుగు భాషా శతకం, తెలుగమ్మ శతకం, బతుకమ్మ శతకం, సింగరేణి శతకం, రామప్ప శతకం, రాయలసీమ శతకం, ఉత్తరాంధ్ర శతకం, విజయవాడ శతకం, నైమిశ శతకం ఇలా అనేక శతకాలు లోని పద్యాలను శ్రీ జొన్నవిత్తుల ఎన్నో పద్యాలను శ్రావ్యంగా పాడి వినిపించడంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది.
తెలుగు కళా సమితి అధ్యక్షులు శ్రీ మధు రాచకుళ్ళ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మధ్యనే కొత్తగా బాధ్యతలను తీసుకొన్న తమ కార్యవర్గం తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకై ఇలాంటి వినూత్న కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని తెలియ చేసారు. తరువాత కార్యదర్శి శ్రీ రవి కృష్ణ అన్నదానం తెలుగు కళా సమితి నూతన కార్యవర్గాన్ని సభికులకు పరిచయం చేశారు.
ఈ కార్యక్రమానికి విచ్ఛేసిన నాట్స్ ప్రతినిధులు , శ్రీ శ్యాం నాళం, శ్రీ శ్రీహరి మందాటి శ్రీ వంశీకృష్ణ వెనిగళ్ల, శ్రీ చంద్ర శేఖర్ కొణిదెల, శ్రీ శేషగిరి కంభంపాటి, శ్రీ రమేష్ బేతంపూడి, శ్రీమతి పద్మజ నన్నపనేని, తానా నుండి విచ్ఛేసిన శ్రీ శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీ వంశీ వాసిరెడ్డి, శ్రీ శ్రీనాధ్ కోనంకి చౌదరి తదితరులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి స్వాగతం పలుకుతూ, భావ సారూప్యం ఉన్న, తెలుగు కళా సమితితో కలిసి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు కళా సమితికి కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులందరికి అభినందనలు తెలియజేశారు.
జొన్నవిత్తుల గారిని నాట్స్ ప్రతినిధులు మరియు న్యూజెర్సీ తెలుగు కళా సమితి కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపికను బహుకరించి సత్కరించారు. నూజెర్సీలో కళాంజలి నృత్య శిక్షణా శాల స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీ జొన్నవిత్తుల వారు, ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనూరాధ దాసరి, కోశాధికారి శ్రీ శ్రీనివాస్ చెరువు మరియు మెంబర్ షిప్ కార్యదర్శి శ్రీమతి జ్యోతి కామరసు గారులు తెలుగు కళా సమితి యువజన కార్యదర్శి శ్రీమతి సుధా దేవులపల్లి గారిని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కష్ట పడిన వాలంటీర్స్ రవి శంకర్ అప్పన, శ్రీని తోడుపునూరి, మోహన్ ములే, శ్రీ సత్య నేమాన తదితర వారందరికీ, ఈ కార్య క్రమానికి ప్రాంగణం సమకూర్చిన గారికి శ్రీమతి ఇందిరా రెడ్డి గారికి, శ్రీ రాజారావు బండారు గారికి, ఆర్ధిక వనరులు సమకూర్చిన శ్రీ రామ్ కొల్లూరి గారికి, రవి కృష్ణ అన్నదానం గారికి , సుధాకర్ ఉప్పల గారికి, శరత్ వేట గారికి , శ్రీమతి ధనలక్ష్మి రాచకుళ్ళ గారికి, తెలుగు కళా సమితి కార్యవర్గం ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియచేశారు. సభకు విచ్చేసిన తెలుగు కళా సమితి పూర్వాధ్యక్షులైన శ్రీమతి జనని కృష్ణ, శ్రీ ఆనంద్ పాలూరి, శ్రీ సుధాకర్ ఉప్పల మరియు శ్రీమతి శ్రీదేవి జాగర్లమూడి పాల్గొని, తెలుగు కళా సమితి కార్యవర్గం పరస్పర సహకారంతో కలిసి పని చేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు ఈ సదస్సు ముగిసిన తరువాత తెలుగు కళా సమితి కార్యవర్గం వారు స్వయంగా ఇంట్లో తాము వండిన వంటకాలతో అందరకు ఆహార ఏర్పాట్లు చేసారు.