తన నటనా కౌశలంతో ప్రేక్షకులను నిత్యం అలరించే నటి సాయి పల్లవి. ఇటీవలే విడుదలైన విరాటపర్వం తో ఆమె తెలుగు ప్రేక్షకుల మెదళ్లలో మరింత నానుతోంది. అయితే.. కశ్మీరీ పండితులకు, గోహత్యకు లింక్ చేస్తూ పొంతన లేని పోలిక పోల్చి చిక్కుల్లో పడిన విషయం కూడా తెలిసిందే. అయితే.. ఇవన్నీ పక్కన పెడితే.. ఆమెను అభిమానులు అభిమానంతో లేడీ పవర్ స్టార్ అంటూ పేరు పెట్టుకున్నారు. ఇక ఇటీవలే వచ్చిన విరాటపర్వంతో ఈ పేరు మరింత స్థిరపడిపోయింది.
అయితే లేడీ పవర్ స్టార్ లాంటి ట్యాగ్ లు సాయి పల్లవికి నచ్చవా? అలా పెట్టుకోవడం ఆమెకు ఇష్టముండదా? అన్న దానికి ఆమె సమాధానమిచ్చారు. విరాటపర్వం సక్సెస్ అయి, హిట్ కొట్టడంతో ఆమె తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ దీనిపై స్పందించారు.
ఇలాంటి ట్యాగ్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. అందుకే నేను పెద్దగా అలాంటి వాటిపై మనస్సు పెట్టనని చెప్పుకొచ్చారు. అయితే… తాను చేసే నటన వల్లే తనకు ఎక్కువ మంది అభిమానులు అయ్యారని, ఎందరో తనను ఆదరిస్తున్నారని అన్నారు. వారి ప్రేమను మనస్సులో పెట్టుకొనే.. మంచి మంచి పాత్రల్లో నటిస్తానని అన్నారు. అభిమానులు ఇచ్చే ట్యాగ్స్ కు ఉబ్బితబ్బిపోతే.. ఒత్తిడి వుంటుందని, సరిగ్గా నటనపై ధ్యాస పెట్టలేనని అన్నారు. అందుకే సాధారణతకే మొగ్గు చూపుతానని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.