ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీని ఇరకాటంలోకి నెట్టేశాయి. వైసీపీ ప్రభుత్వంపై విద్యావంతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వుందన్న ప్రచారం బాగా ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఫలితాలు కచ్చితంగా ప్రభావం చూపిస్తాయన్న ప్రచారమూ అంతే సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం సర్కార్ పై అస్సలు పడదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వైసీపీని బాగా ఆదరించారని, అలాగే ఫలితంతో తమ బలం పెరిగిందన్న టీడీపీ వాదన హాస్యాస్పదమని కొట్టిపారేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని ఆయన తెలిపారు. పీడీఎఫ్ ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్ళాయని ఆయన అంగీకరించారు. అంతేకాదు ఈ ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలు కలిపి చూడాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ రకంగాను ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదన్నారు.
ఈ ఫలితాలను తాము హెచ్చరిక గా భావించడం లేదన్నారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని సజ్జల తెలిపారు. ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారని ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు సజ్జల తెలిపారు. యువతకు కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లు జారీచేశామని వెల్లడించారు.