వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. లైట్స్ ఆన్… స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల పరామర్శ కంటే ప్రచారంపైనే మక్కువ ఎక్కవు అంటూ మండిపడ్డారు. వరద సాయంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ఏపీ ప్రజలు నమ్మడం లేదన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వం విషయంలో మంచి ఫీడ్ బ్యాక్ వుందన్నారు. చంద్రబాబు చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని విమర్శించారు.
టీడీపీ హయాంలో చంద్రబాబు ఏ రోజైనా ఒక్క పైసా తక్షణ సహాయం చేశారా? అంటూ సజ్జల తీవ్రంగా దుయ్యబట్టారు. విపత్తు సమయంలో ఫొటోలకు ఫోజులు ఇచ్చారని, తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. 40 ఏళ్ల చంద్రబాబు అబద్ధపు జీవితాన్ని ఆయన ఇంకా కొనసాగిస్తూనే వున్నారని, అబద్ధాలే నిజమనుకునే స్థాయి నుంచి అబద్ధమే జీవితం అన్నట్లుగా మార్చుకున్నారని సజ్జల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సమయంలో వ్యవస్థ వికేంద్రీకరణ జరిగి, అధికారులు బాగా పనిచేశారని సజ్జల కితాబునిచ్చారు. సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి, సమీక్ష చేశారని, వరద ప్రభావిత జిల్లాలకు 9.4 కోట్లు చొప్పున విడుదల చేశారని సజ్జల గుర్తు చేశారు.