రాజధాని విషయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. వికేంద్రీకరణే వైసీపీ ప్రభుత్వ విధానమని ప్రకటించారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాక్షలతో వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించే గతంలో 3 రాజధానుల బిల్లు పెట్టామన్నారు. మూడు రాజధానులకే వైసీపీ కట్టుబడి వుందన్నారు. ప్రభుత్వ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పూ లేదన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు వుంటాయన్నారు. వీటిని తాము మూడు రాజధానులు అనే పిలుచుకుంటామని స్పష్టం చేశారు. రాజధానుల వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో నడుస్తోందన్నారు. తమ వాదన వినిపిస్తున్నామని, ప్రభుత్వం కోర్టులో వినిపిస్తున్న విషయాన్నే మంత్రి బుగ్గన చెప్పారన్నారు.
మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయ్యిందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సంచలన ప్రకటన చేవారు. 3 రాజధానులంటూ ఏమీ లేవని, రాష్ట్రానికి విశాఖపట్నమే ఏకైక రాజధాని అని తేల్చి చెప్పారు. బెంగళూరులో జరిగిన రోడ్ షోలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన ఏపీ రాజధాని అంశంపై ప్రకటన చేశారు. మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందన్నారు. ఏపీ పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని స్పష్టం చేశారు.
ఏపీకి విశాఖ ఒక్కటే రాజధాని అని అన్నారు. ఏపీకి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ వాస్తవం కాదన్నారు. కర్నూలు న్యాయ రాజధాని కాదని, అక్కడ హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే వుంటుందని స్పష్టం చేశారు. కర్ణాటకలోని ధార్వాడ్, గుల్బర్బాలో హైకోర్టు బెంచ్ లు ఉన్నాయని అలాగే ఏపీలోనూ ఉంటాయన్నారు.