వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. టీడీపీలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారని, అందుకే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలేం తీసుకుంటాం? అని వ్యాఖ్యానించారు. అయితే.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
సీఎం జగన్ ప్రజలను నమ్ముకొని పాలన చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ లను నమ్ముకొని కాదని చురకలంటించారు. అయితే… ఫోన్ ట్యాపింగ్ పై తాను కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్న కోటంరెడ్డి వ్యాఖ్యలపై కూడా సజ్జల స్పందించారు. ఎవరైనా, ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక… నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జీగా ఇంకా ఎవరినీ నియమించలేదన్నారు. కొంత మందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసంటూ వ్యాఖ్యానించారు.
అవమానాలు జరిగే చోట ఉండాల్సిన అవసరం తనకు లేదని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి తాను పోటీచేయాలని భావించడం లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ పై తనకు స్పష్టమైన సాక్ష్యం దొరికిందన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న తనపై నిఘా పెట్టారని మండిపడ్డారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి తనతో చెప్పారన్నారు.
ముందు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నమ్మలేదన్నారు. సీఎం జగన్‌పై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించానన్నారు. 20 రోజుల ముందు తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికిందన్నారు. సీఎం గానీ, సజ్జల గానీ చెప్పకుండా తన ఫోన్ ట్యాప్ చేయరని… అనుమానాలు ఉన్న చోట తానుండాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలను భరించానని, పార్టీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు.