అన్నాడీఎంకే పార్టీలో కీలక పరిణామం జరిగింది. పళని స్వామి, ఓ పన్నీర్ సెల్వం మధ్య కొన్ని రోజులుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. ఎవరి చేతిలో పార్టీ వుండాలన్న దానిపై తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామి వుంటారన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థిచింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో పళని స్వామి మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. సుప్రీం తీర్పుతో పళని స్వామికి లైన్ క్లియర్ అయ్యింది.
ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. ఈపీఎస్, ఓపీఎస్ మధ్య తీవ్ర ఆధిపత్య పోరు జరిగింది. గతేడాది జూలై 11 న అన్నాడీఎంకే జనరల్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పళని స్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక చెల్లదంటూ పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిగింది. ఈ ఎన్నిక చెల్లదని ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పళని స్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామినే ఎంపిక చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే… దీనిని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.