సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస కాండకు మూల సూత్రధారి ఆవుల సుబ్బారావే. ఈ విషయాన్ని పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ లో తేల్చేశారు. అతడిపై హత్యాయత్నం, అనుమానాస్పద మృతితో పాటు ఐపీసీ 143, 324,347 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. అయితే.. సుబ్బారావుతో సహా అతని అనుచరులు మల్లారెడ్డి, శివకుమార్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకు తరలించారు. అగ్నిపథ్ ద్వారా భారత ఆర్మీలో రిక్రూట్ మెంట్ జరిగితే.. తమ సెంటర్లు మూతపడే అవకాశకాలున్నాయన్న నేపథ్యంలోనే సుబ్బారావు ఇలా విధ్వంసానికి రచన చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విధ్వంస రచన అంతా కూడా సుబ్బారావు నిర్వహించే సాయి డిఫెన్స్ అకాడమీ కనుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం. అల్లర్లకు ఒక రోజు ముందు ఇనిస్టిట్యూట్ వేదికగానే అంతా రచన చేసినట్లు కూడా తెలుస్తోంది. దీనికి తగ్గ ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. సుబ్బారావు, అతని అనుచరులు ఓ హోటల్ లో కూర్చొని ఈ విధ్వంసానికి పథక రచన చేసినట్లు తెలుస్తోంది.